హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం శనివారం నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. నవంబర్ 14 నుంచి 30 వరకు 17 రోజుల పాటు, మూడు కార్తీక సోమవారాలు కలిసివచ్చేలా ఈ ఉత్సవం జరుగుతుంది. రోజూ సాయంత్రం 5:30 నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి. భక్తులు ప్రతి సాయంత్రం సామూహికంగా దీపాలు వెలిగిస్తారు.

ప్రధాన కార్యక్రమాలు

  • చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు తదితరుల ప్రవచనాలు; పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు
  • మహా శంఖాభిషేకం, ఉజ్జయిని మహాకాళ భస్మాభిషేకం, సోమనాథ జ్యోతిర్లింగ పూజ, కోటి కుంకుమార్చన, కోటి గాజుల అర్చన
  • కొల్హాపూర్ మహాలక్ష్మి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మవార్ల దర్శనం; ప్రముఖ ఆలయాల దేవతల కల్యాణోత్సవాలు

దీపాలు, నూనె, వత్తులు, పూజా సామగ్రిని భక్తులకు ఉచితంగా అందిస్తామని, ఎలాంటి రుసుము గానీ విరాళాలు గానీ తీసుకోబోమని నిర్వాహకులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపులు

నవంబర్ 14 నుంచి 30 వరకు రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు కట్ట మైసమ్మ ఆలయం నుంచి ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్స్, అశోక్ నగర్ నాలా వరకు రద్దీ ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి స్టీల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను కట్ట మైసమ్మ ఆలయం వద్ద ధోబీ ఘాట్, డీబీఆర్ మిల్స్, గాంధీనగర్, కవాడిగూడ, సీజీవో టవర్స్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్స్ మీదుగా మళ్లిస్తారు. అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ నుంచి కట్ట మైసమ్మ ఆలయం వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వైపు పంపుతారు. కట్ట మైసమ్మ జంక్షన్, ఆర్కే మఠ్ రోడ్, ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్స్ ప్రాంతాలను వాహనదారులు తప్పించుకోవాలని సూచించారు.