అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో మంగళవారం (నవంబర్ 24) కార్తిక పౌర్ణమి గిరిప్రదక్షిణ వైభవంగా జరగనుంది. ఈ ఏడాది 1.5 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేసిన దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను కొండ దిగువకు తీసుకువచ్చి తిరుచ్చి పూజ నిర్వహిస్తారు. ఉదయం 8:30కు ఊరేగింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు తొలిపావంచాల వద్ద సత్యరథం ప్రారంభమై సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు పంపా హారతి, రాత్రి 7:30కు జ్వాలాతోరణం నిర్వహిస్తారు.
తొలిపావంచాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, సుబ్బరాయపురం, సాక్షి గణపతి ఆలయం, బెండపూడి సమీపంలోని జాతీయ రహదారి, పోలవరం కాలువ గట్టు మీదుగా పంపా సరోవరం, రత్నగిరి, సత్యగిరి కొండల చుట్టూ తిరిగి తొలిపావంచాల వద్దకు చేరేలా 8.2 కి.మీ. (3.9 కి.మీ. తారు రోడ్డు, 4.3 కి.మీ. గ్రావెల్ రోడ్డు) మార్గాన్ని సిద్ధం చేశారు. కాలిబాటన నడిచే భక్తుల కోసం గ్రావెల్ మార్గంలో నీరు చల్లి ఎండుగడ్డి పరిచారు.
కాకినాడ జిల్లా ఎస్పీ బింధు మాధవ్, ఆలయ ఈవో చక్రధర రావు ఏర్పాట్లను సమీక్షించారు. భద్రత కోసం ఒక డీఎస్పీ, 3 సీఐలు, 10 ఎస్ఐలు, 150–200 మంది కానిస్టేబుళ్లు, 50 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు.




