హైదరాబాద్: దేశవ్యాప్తంగా నూతన దేవాలయాల నిర్మాణం పెరుగుతుండటంతో సంప్రదాయ ఆలయ వాస్తు, శిల్పకళను నేర్చుకునేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని ప్రముఖ స్థపతి డి.ఎన్.వి. ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్లోని ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న 'లివింగ్ టెంపుల్ చాప్టర్ 2' ఆర్ట్ ఫెస్టివల్లో ఆదివారం ఆయన ప్రత్యేక ప్రసంగం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్పకళా సంస్థలో తాను చదువుకున్న రోజుల్లో 60 సీట్లు ఉండగా కేవలం 30 మంది మాత్రమే చేరేవారని, వారిలో ముగ్గురు మాత్రమే ఈ వృత్తిలో కొనసాగారని ప్రసాద్ స్థపతి గుర్తుచేసుకున్నారు. కానీ నేడు 200 మందికి పైగా విద్యార్థులు శిల్ప శాస్త్రం, ఆలయ నిర్మాణ విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు.
సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రధాన స్థపతిగా, భువనగిరి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన శిల్పిగా పనిచేసిన ఆయన, ఆలయ నిర్మాణంలోని శాస్త్రీయ కోణాలను వివరించారు. స్వర్ణగిరి ఆలయంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టు పాదాలపై పడేలా ఖగోళ గణితంతో నిర్మించామని తెలిపారు.
యాదగిరిగుట్ట ఆలయ సంప్రదాయాలను కూడా ఆయన ప్రస్తావించారు. నవంబర్ 29 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో జల సంరక్షణకర్త కల్పనా రమేశ్, ఆర్కిటెక్ట్ జి. శ్రీనివాస్ మూర్తి, పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.




