శ్రీశైలం: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి సుమారు 45 వేల మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఆదివారం 48,557 మంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవస్థానం చైర్మన్, ఈవో తెలిపారు.

దర్శనాల్లో మార్పులు

  • కార్తీక మాసమంతా శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనం, సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు నిలిపివేత
  • మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు మూడు విడతల్లో స్పర్శ దర్శనం
  • సోమవారం భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే

తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణమ్మకు దీపాలు వదిలారు. గంగాధర మండపం, అమ్మవారి ఆలయం వెనుక, ఉత్తర మాడవీధిలో కార్తీక దీపాలు వెలిగించారు. క్యూలైన్లలో భక్తులకు అల్పాహారం అందించినట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పి. రమేశ్ నాయుడు తెలిపారు.

పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం

సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కరిణి నాలుగు వైపులా దీపాలు వెలిగించి లక్ష దీపోత్సవం జరిపారు. అనంతరం ప్రత్యేక హారతులు ఇచ్చారు. నంద్యాల జిల్లాలోని మహానంది, సంగమేశ్వరం ఆలయాలకు కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.