శ్రీశైలం: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శుక్రవారం (నవంబర్ 27) శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణరథోత్సవం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక వైదిక క్రతువులు ప్రారంభమయ్యాయి. లోకకళ్యాణార్థం అర్చకులు సంకల్పం చెప్పిన అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు.
ఉదయం 7:30 గంటలకు గంగాధర మండపం వద్ద స్వర్ణరథోత్సవాన్ని ప్రారంభిస్తారు. బంగారు రథంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి, నంది మండపం వరకు ఊరేగించి తిరిగి గంగాధర మండపానికి చేరుస్తారు.
ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండగా, తెలుగు సంప్రదాయ కళారూపాలైన కోలాటం, తప్పెట చిందులు వంటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని దేవస్థానం అధికారులు తెలిపారు.




