తిరుమల: కార్తీక మాస పుణ్యదినాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం, సాయంత్రం సాలకట్ల కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.45 గంటల మధ్య శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

సాధారణ ఉత్సవాల్లో మలయప్ప స్వామి ఊరేగుతుండగా, ఉగ్ర శ్రీనివాసమూర్తి మాత్రం ఏడాదిలో కైశిక ద్వాదశి రోజున మాత్రమే ఆలయం వెలుపలికి వస్తారు. 14వ శతాబ్దంలో సూర్యకిరణాలు తాకి అగ్నిప్రమాదం జరిగిన ఘటన తర్వాత, సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపు పూర్తి చేసే సంప్రదాయం కొనసాగుతోందని టీటీడీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆలయంలో 82 శ్లోకాలతో కూడిన కైశిక పురాణ పారాయణంతో ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాలకట్ల కార్తీక దీపోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు. ఆగమ నియమాల ప్రకారం గుర్తించిన 52 ప్రదేశాల్లో ప్రమిదలు, మూకుళ్లు, అరకంచాల్లో నేతి దీపాలు వెలిగించి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు.

ఈ ఉత్సవాల నేపథ్యంలో శనివారం సాయంత్రం నిర్వహించే వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. నవంబర్ 20న శుక్రవారం మొత్తం 56,695 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ శనివారం వెల్లడించింది.