తిరుమల: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం (నవంబర్ 24) సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహించనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవ వేడుక ప్రారంభమవుతుంది.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి, ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి సమర్పిస్తారు.
ఆలయ ప్రాంగణమంతా దీపాల అలంకరణ
- దీపారాధన స్థలాలు: గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, తిరుమలరాయ మండపం, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.
- సేవల రద్దు: కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రతి నెలా పౌర్ణమినాడు నిర్వహించే గరుడ సేవను, అలాగే సహస్ర దీపాలంకరణ సేవను మంగళవారం రద్దు చేసినట్లు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ప్రకటించారు.
నేతి దీపాల వెలుగుల్లో ఆనంద నిలయంతో పాటు తిరుమల కొండపై ఉన్న అనుబంధ ఆలయాలన్నీ భక్తులకు కనువిందు చేయనున్నాయి. వేడుకల నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.




