తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 14 వరకు జరగనున్న నేపథ్యంలో, తిరుమల నుంచి తిరుచానూరుకు తీసుకువచ్చే శ్రీవారి పడి సారె ఊరేగింపు మార్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం ట్రయల్ రన్ నిర్వహించింది.

ఏనుగుపై ఊరేగింపు మార్గం

తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని శ్రీ వినాయకస్వామి ఆలయం నుంచి ఏనుగుపై సారెను ఉంచి ట్రయల్ రన్ ప్రారంభించారు. శ్రీ కోదండరామాలయం, చిన్నబజారు వీధి, పాత హుజూర్ కార్యాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, బండ్ల వీధి, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతిపురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరు పసుపు మండపానికి, అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి ఊరేగింపు చేరుకుంది.

పంచమితీర్థం ఏర్పాట్లపై సమీక్ష

అనంతరం తోళప్ప గార్డెన్స్‌లో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున అమ్మవారికి సమర్పించే పడి సారె రెండు ఆలయాల మధ్య పవిత్ర అనుబంధానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.